తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్వయం సహాయక సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతతతో పాటు నూతన ఉత్సాహం, శక్తి లభిస్తాయని పేర్కొన్నారు.నూకసాని బాలాజీ మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా సాధన ఉత్తమ మార్గమని చెప్పారు.పతంజలి యోగా సంస్థ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ భీమ్ నాథ్, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ ఆర్. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.అలాగే, ఈ నెల 22వ తేదీ నుంచి ఒంగోలు నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రతిరోజూ యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పతంజలి సంస్థ యోగా గురువు బాలసుబ్రమణ్యం తెలిపారు. ప్రజల ఆసక్తిని బట్టి ఇతర ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
