తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఎఆర్ డీఎస్పీ శ్రీ కె. శ్రీనివాసరావు గారు, పోలీస్ అధికారులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి, భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పోరాట పటిమను కొనియాడారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి ఆయనేనని, ఆయన దేశభక్తి, జాతీయవాద స్ఫూర్తి భారతీయుల హృదయాల్లో జ్వాలలు రగిలించిందని అన్నారు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు సాగించిన సాయుధ పోరాటం తెలుగు జాతి చరిత్రలో గొప్ప ఘట్టంగా చిరస్థాయిగా నిలిచిపోతుందని, తెలుగు జాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ జయంతి సందర్భంగా ఆ మహావీరుడిని మనమందరం స్మరించుకుందామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.