తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమం ఈనెల తొమ్మిదవ తేదీన టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఉంటుంది. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు పొందూరు గ్రామంలో ప్రజలతో కలెక్టర్ ప్రత్యేకంగా సభ నిర్వహించి ముచ్చటిస్తారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్న తీరుపై స్థానికులతో మాట్లాడతారు. మండలంలోని ఇతర గ్రామాలకు కూడా జిల్లాస్థాయి అధికారి ఒకరు అదే రోజు ఉదయం వెళ్లి స్థానిక సమస్యలు, పథకాలు అందుతున్న తీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. సాయంత్రం పొందూరులో ఈ విషయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి వారు తీసుకువస్తారు. ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేస్తారు. పొందూరులో నిర్వహించే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.