ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, కందులాపురంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, విద్యార్థుల హాజరు నమోదు, తరగతి గదుల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ పఠన,రచన,గణిత, భాషా నైపుణ్యాలను పరీక్షించి, అభ్యసన సామర్థ్యాలను అంచనా వేశారు. పాఠశాల విద్యార్థులు అందరూ ప్రాథమిక అభ్యసన లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూసి నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలును తనిఖీ చేశారు. పోషక విలువలు కలిగిన, రుచికరమైన ఆహారాన్ని అందించేలా వంట సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యార్థుల భద్రతా చర్యలు, పచ్చదనం, పరిశుభ్రమైన తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యా నాణ్యతతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ తనిఖీలో సిఆర్పీ మురళీమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *