గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 4వేలు మెడికల్ అలవెన్స్ చెల్లించాలని,పి.ఎఫ్, ఈ. ఎస్.ఐ,పెన్షన్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఈనెల 30న ఉదయం 10 గంటలకు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్ తెలిపారు. ఈరోజు ఉలవపాడు మండలంలోని, కరేడు పంచాయతీ ఆఫీస్ మస్టర్ పాయింట్ వద్ద కార్మికులతో సమావేశం అయ్యారు.జీవీబీ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక రెవిన్యూ వచ్చే పంచాయతీ కరేడు అని, ఈ పంచాయతీ పరిధిలో 25 మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీరికి 11,500 మాత్రమే వేతనం వస్తుందని తెలిపారు. మార్చి నెలలో కార్మికులకు ఇచ్చిన యూనిఫామ్ కూడా ఇంకా కొంతమందికి ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచడం శోచనీయం అన్నారు. ప్రకాశం జిల్లా అంతటా 15 వేలకు తగ్గకుండా పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారని, కరేడు లో అతి తక్కువగా ఇస్తున్నారని, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. 17వేల మంది జనాభా వదిలిన మలినాలన్నీ రోజు ఉదయాన్నే శుభ్రం చేసి, ప్రజలందరూ అనారోగ్యం పాలవకుండా చూస్తున్న పంచాయతీ కార్మికుల పట్ల, పై అధికారులు అశ్రద్ధ వహించటం సిగ్గుచేటు అన్నారు. కనీసం గుర్తింపు కార్డులు కూడా లేకపోవడం అన్యాయమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 30న ఒంగోలుకు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్మికులు ఈ తిరుపాలు,జీ రాజశేఖర్, ఎండ్లూరి నల్ల కోటయ్య,జీ.శేఖర్, సిహెచ్ వెంకట రమణయ్య, గడ్డం బాలయ్య, కరేటి రోజమ్మ,సుమలతమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *