పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహ పద్ధతిలో “పొగాకు రైతుల ధర్మదీక్ష” కందుకూరు వేలం నెంబర్ 26 కేంద్రం వద్ద ప్రారంభించబడింది.

ఒకవైపు రైతులు మద్దతు ధర కోసం నిరంతరం పోరాటాలు చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కనీసం ₹200 ధర నిర్ణయించాలని చెబుతున్నప్పటికీ, పొగాకు బయ్యర్లు రైతులను అవమానిస్తూ, అన్యాయంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ధర్మదీక్ష ప్రారంభించబడింది.ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను ఐక్యం చేసినట్లు, నేడు రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా సత్యాగ్రహమే మార్గమని తెలిపారు. ధర్నాలు, వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో ధర్మదీక్ష చేపట్టామని చెప్పారు.రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా, ప్రకాశం జిల్లా రైతులు వ్యవసాయం వదిలి వలస వెళ్తున్న పరిస్థితిని అజెండాగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన తాను, పొగాకు రైతులకు మద్దతు ధర వస్తేనే కనీసం కొంతమంది రైతులు గ్రామాల్లో నిలబడగలరని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వానికి వినతులు / డిమాండ్లు:

  • పొగాకు రైతులకు తక్షణమే మద్దతు ధర కల్పించాలి
  • ఇప్పటికే తక్కువ ధరకు అమ్మిన రైతుల నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి
  • నష్టపోయిన రైతులను గుర్తించి కేంద్ర పథకం NLM ద్వారా పశుసంవర్ధక రుణ సదుపాయం కల్పించాలి
  • పొగాకు బోర్డు ఉన్నప్పటికీ దళారుల అరాచకాన్ని అరికట్టేందుకు అసెంబ్లీలో చర్చ జరిపి పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
  • వేలం ఆఖరి సమయంలో అధిక ధరలు చూపించి, తదుపరి సంవత్సరం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేసే విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • కందుకూరు వేలం నెంబర్ 26 కేంద్రంలో రైతులను అవమానించిన బయ్యర్‌పై శాశ్వత నిషేధం విధించాలి

కందుకూరు, కొండేపి నియోజకవర్గాల్లో పొగాకు పంటే ప్రధాన ఆధారంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఈ ధర్మదీక్షకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *