ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని కందుకూరు ఎం.వి.ఐ అనిల్‌కుమార్ ప్రైవేట్ బస్సుల యజమానులు, డ్రైవర్లను హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కందుకూరు పట్టణంలోని జాతీయ రహదారి–16బీ జంక్షన్ వద్ద ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఎం.వి.ఐ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 11 ప్రైవేట్ బస్సులను పరిశీలించారు. బస్సులకు సంబంధించిన అనుమతి పత్రాలు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, బీమా తదితర అవసరమైన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. అలాగే డ్రైవర్లకు సంబంధించిన పత్రాలు, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను కూడా తనిఖీ చేశారు.రాత్రి ప్రయాణాలపై ప్రత్యేక దృష్టి
రాత్రి వేళల్లో ప్రయాణించే బస్సుల డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎం.వి.ఐ సూచించారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు.బస్సుల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను రోడ్డుపైకి తీసుకువస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు ఈ సందర్భంగా ఎం.వి.ఐ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ బస్సులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా వాహనాల పత్రాలతో పాటు భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.“ప్రైవేట్ బస్సుల యజమానులు, డ్రైవర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వాహనానికి అవసరమైన పత్రాలు సక్రమంగా ఉండాలి. ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు” అని ఎం.వి.ఐ అనిల్‌కుమార్ స్పష్టం చేశారు.తనిఖీలను కేవలం పత్రాల పరిశీలనకే పరిమితం చేయకుండా, ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రైవేట్ బస్సులపై తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *