జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి శీలం ప్రసాద్ రావు ఎంపిక
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, స్థానిక సోమరాజు పల్లి మండల పరిషత్ మోడల్ పాఠశాల నందు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న శీలం ప్రసాదరావు ను జిల్లా విద్యాశాఖ అధికారుల కమిటీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక చేశారు. వీరు 2001 డీఎస్సీ ద్వారా ఎంపికై 25 సంవత్సరాల సర్వీసులో విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాలల ఉన్నతికి చేసిన విశేష కృషికి, పేద విద్యార్థులను గురుకుల పాఠశాలలో చేర్పించుటకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి సీట్లు సాధించడంలో, దాతల సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ,సమాజాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేస్తూ వివిధ సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలను మరియు ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వీరు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందుకున్నారని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. స్వతహాగా వీరిది ఉపాధ్యాయ కుటుంబం అని వీరి తండ్రి శీలం జలాపతి 42 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి విశేష సేవలు అందించారని వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని శీలం ప్రసాద్ రావు వలేటివారిపాలెం, ఉలవపాడు, పామూరు, సింగరాయకొండ మండలాలలో వివిధ పాఠశాలలలో పేద పిల్లల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు అని,తమ గ్రామ వాసికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా సమగ్ర శిక్ష అధికారి మసనం జాలరత్నం మరియు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అర్రిబోయిన రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డి.సి.ఈ.బీ సెక్రటరీ మర్రిబోయిన శ్రీనివాసులు,మండల విద్యాశాఖ అధికారులు కత్తి శ్రీనివాసులు ,ఆవుల శ్రీనివాసరావు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంబటి బ్రహ్మయ్య, కొల్లూరు వెంకయ్య ,బీసాబత్తిన శ్రీనివాసరావు , నూకసాని వెంకటేశ్వర్లు , పనబాకల శ్రీనివాసులు అభినందనలు తెలియజేశారు.