తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో కరువు పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు.కరువు పనులు చేస్తున్న కూలీలు తమ సమస్యలను వివరిస్తూ కూలీ రేట్లు పెంచాలని, వేతనాలు పెంచాలని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతున్నారని తెలిపారు.ప్రభుత్వం తమకు ఐదు రూపాయలు ఇస్తే, ధరల పెరుగుదల రూపంలో యాభై రూపాయలు తిరిగి తీసుకుంటున్నట్లుగా ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు అందించాలని వారు కోరుతున్నారని తెలిపారు.కరువు పనుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు బీమా పరిహారం సకాలంలో అందడం లేదని కూలీలు వాపోయారని తెలిపారు. అనారోగ్యానికి గురైనప్పుడు ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, అక్కడ చికిత్స ఖర్చులు భరించలేక అప్పులు చేయాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.కూలీలకు గౌరవప్రదమైన జీవితం కల్పించాలంటే కూలీ పెంపు, ఉపాధి, ఇళ్లు, చౌక ధరలకు నిత్యావసర వస్తువులు, మెరుగైన వైద్యం, ప్రమాద బీమా వంటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు.కూలీల సమస్యలు కేవలం వినతులతో పరిష్కారం కావని, ప్రజల ఐక్య పోరాటమే సమస్యల పరిష్కారానికి మార్గమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం తమ వద్దకు వచ్చే నాయకులను కూలీలు తమ సమస్యలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.“మా కూలీ పెంచుతారా? మా ఇళ్లు కట్టిస్తారా? ధరలు తగ్గిస్తారా? రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు ఇస్తారా? ప్రమాదం జరిగితే బీమా అందిస్తారా? పేదలకు మెరుగైన వైద్యం అందిస్తారా?” అని నాయకులను నిలదీయాలని ఆయన సూచించారు.కూలీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని అండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు.ఈకార్యక్రమం లో సీఐటీయూ నాయకులు టంగుటూరి రాము తదితరులు ఉన్నారు.