తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా “మన నర్సులు – మన భవిష్యత్తు – సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడతారు” అనే ఐక్యరాజ్యసమితి నినాదంతో వైద్య ఆరోగ్యశాఖ,గుడ్ హెల్ప్ ఫౌండేషన్,కె.ఎస్.ఎమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కనిగిరి పట్టణంలోని కమ్యూనిటీ వైద్యశాల నందు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి వారు వైద్య రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడారు.రోగుల సేవలో నర్సులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తూ ఆరోగ్య వ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు.కె.ఎస్.ఎమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్,మాజీ కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్,న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ నర్సుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు.కరోనా మహమ్మారిని నివారించడానికి నర్సుల సేవలు వెలకట్టలేనివని, అహర్నిషలు కృషి చేస్తూ కరోనా రోగులకు సేవ చేస్తున్నారని అన్నారు.కమ్యూనిటీ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ నర్సులు వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, రోగులకు ధైర్యం నింపుతూ సేవలందిస్తున్నారని తెలిపారు.గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నర్సుల సేవలు మరువలేనివని, ప్రజారోగ్య పరిరక్షణలో వారు ముందుండి పనిచేస్తున్నారని కొనియాడారు.వారిని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్యశాల వివిధ విభాగాల డాక్టర్లు,,కె.ఎస్.ఎమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధి షేక్ సుహైల్ (బన్ను), వైద్య సిబ్బంది,నర్సులు,ఆశా కార్యకర్తలు,గుడ్ హెల్ప్ ఫౌండేషన్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.