తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో… ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పట్టణంలోని మాచవరం రోడ్డులో శనివారం ఉదయం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, మున్సిపల్ కమిషనర్ కే. అనూష, అధికారులు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ సహా అందరూ చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.MLA మాట్లాడుతూ… కేవలం అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేయటం వల్ల స్వచ్ఛత – శుభ్రత సాధ్యం కాదన్నారు. పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తేనే, మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దగలమని అన్నారు. అప్పుడే స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పథకం యొక్క ఆశయం నెరవేరుతుందన్నారు.వ్యక్తిగత శుభ్రతతోపాటు, తమ చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరిపై ఉందని నాగేశ్వరరావు అన్నారు. ఇళ్ళు, దుకాణాలు, ఇంకా అనేక చోట్లనుంచి వచ్చే చెత్తను, పారిశుద్ధ్య సిబ్బంది సూచించిన విధంగా వేరుచేసి ఇవ్వాలన్నారు. కందుకూరును ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలియజేశారు.