తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొచ్చెర్లకోట గ్రామంలో కోడిపందేలపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో కోడిపందేలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, 5 మొబైల్ ఫోన్లు మరియు రూ.12,090 నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తాయని, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు, జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.