తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సామ సుబ్బారావు అన్నారు . శుక్రవారం గిద్దలూరు పట్టణంలో ఏర్పాటు చేసిన గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల విద్యా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. బడి వయసు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న నాణ్యమైన విద్యాబోధన, కార్పొరేట్ స్థాయి మౌలిక వసతుల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక కిట్ల విశిష్టతను తల్లిదండ్రులకు వివరించాలని,మధ్యాహ్న భోజన పథకంలో పాటిస్తున్న ఆహార నాణ్యతా ప్రమాణాలు, పోషకాల గురించి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని,పాఠశాలల్లో అందుబాటులో ఉన్న ఆధునిక వసతులను చూపిస్తూ అడ్మిషన్ల పెంపుదలకు కృషిచేయాలని,ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎలా రూపాంతరం చెందాయో తెలియజెప్పాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.