తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నందు తేదీ 06.06.2026న జరగనున్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంశ్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ చిరాగ్ పాశ్వాన్ గారితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారితో పాటు కనిగిరి ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు శుక్రవారం అక్కడ ప్రదేశాన్ని సందర్శించి ముందస్తు భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.విగ్రహ ఆవిష్కరణ ప్రదేశము, వేదిక పరిసరాలు, వీఐపీ రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారాలు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు తదితర అంశాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి ఎక్కువ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వీఐపీల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు, బందోబస్తు, అనుమానాస్పద వ్యక్తులు మరియు వస్తువులపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించి, ట్రాఫిక్ మరియు భద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, కనిగిరి ఇంచార్జి డిఎస్పీ పి.శ్రీధర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, కనిగిరి సీఐ యు.శ్రీనివాసులు, ఎస్సైలు మరియు తదితరులు పాల్గొన్నారు.
