బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి -డాక్టర్ ప్రవీణ్ కుమార్
తొలి సుబోదయం న్యూస్ కనిగిరి:-
“బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా గురువారం కనిగిరి పట్టణ పరిధిలోని కాశిరెడ్డి కాలనీలో ఉన్న యానాది కుటుంబాలకు సమగ్ర శిక్ష అభియాన్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్,ఆంధ్రప్రదేశ్ వెట్టి విమోచన కూటమి సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గుడ్ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మండ్రు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండాలని విద్య ద్వారానే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తెలిపారు.ప్రతి బాలబాలికలు విద్యను అభ్యసించడం ద్వారా బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల వంటి సామాజిక దురాచారాలను సమూలంగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు,విద్యా సదుపాయాల గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించారు.పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించి వారి విద్యాభ్యాసానికి సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్లు మండ్రు రమేష్ బాబు,నాగవేణి,జి ఎస్ అండ్ జి డి కె ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్ తల్లిదండ్రులు, బాలబాలికలు పాల్గొన్నారు.