google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

రాష్ట్రవ్యాప్తంగా పేదరిక నిర్మూలన, సామాజిక భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లను” పంపిణీ చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు. బుధవారం ప్రకాశం జిల్లా, కొండపి మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో ఎన్టిఆర్ బరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ..లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, రూపాయి అవినీతి లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ నేరుగా వారి ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు.​ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,17,573 మందికి 94కోట్ల 82 లక్షల 77 వేల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కొండపి మండలంలో మొత్తం 6,063 మందికి రెండు కోట్ల అరవైదు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు అందిస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం సుమారు రూ. 2,711.79 కోట్లు విడుదల చేస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు 62.19 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర వర్గాల వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు.
ప్రతి ఇంటికీ అందుతున్న పథకాల ఫలాలు
​కట్టుబడిపాలెం సభలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం కేవలం హామీలు ఇవ్వడమే కాకుండా, వాటిని నూటికి నూరు శాతం అమలు చేస్తూ ప్రజా సంక్షేమ రాజ్య స్థాపనకు కట్టుబడి ఉందన్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 4,000/- అలాగే దివ్యాంగులకు నెలకు రూ. 6,000/- చొప్పున పెన్షన్ అందిస్తూ వారి జీవితాల్లో ప్రభుత్వం కొండంత భరోసానిచ్చింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ. 15,000/- వరకు పెన్షన్ అందజేస్తోందన్నారు.
​అన్నదాతకు అండగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుబడుల మద్దతు, ఉచిత పంటల భీమా, సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీలను అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చిందన్నారు.
​మహిళా సాధికారతకు పొదుపు సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతనిస్తూ, వారిని స్వయం ఉపాధి రంగాల్లో రాణించేలా ప్రత్యేక పథకాలను ప్రభుత్వం రూపొందించిందని ఆయన చెప్పారు. పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి, ఉచిత వైద్య సేవలను మరింత బలోపేతం చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి 13 వేల రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు. దీపం పథకం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. స్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకం ద్వారా మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూ.లకే కడుపునిండా అన్నపెట్టి పేద ప్రజలకి ఆసరాగా నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ​”మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదనీ.. చేతల ప్రభుత్వం అని చెప్పారు. సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందాలనేదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఈ గ్రామానికి గతంలో రోడ్డు లేదని నేను రోడ్డు వేశాకే ఈ గ్రామానికి వస్తానని చెప్పి రోడ్డు వేసిన తర్వాత ఈ గ్రామానికి వచ్చానని మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ గ్రామానికి బస్సు వారం రోజుల్లో బస్సు సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పారు. ఎస్.సి కాలనీలో రోడ్లు,కాలువలు కూడా మార్చి లోపు పూర్తి చేస్తానన్ని హామీ ఇచ్చారు. ఇక్కడ అంకమ్మ తల్లి గుడికి కూడా ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పిస్తానన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకి గ్రూప్ ద్వారా మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకు ముందు కట్టుబడిపాలెం గ్రామంలో రూ. 42 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు,సైడు కాల్వలను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *