తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ మరియు ట్రస్ట్ చైర్ పర్సన్ షహనాజ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే కోవలో తాజాగా స్థానిక ఒంగోలు నగరంలోని కమ్మపాలెం వద్ద గల ‘ఆశయం వృధాలయం’ లోని వృద్ధులు, వితంతువులు మరియు అనాథల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది.
ప్రవాస భారతీయుడు పిన్నిక శ్రీనివాస రావు గారి ఆర్థిక సహకారంతో సుమారు రూ. 10,000/- విలువైన నిత్యవసర సరుకులను అక్కడ నివసిస్తున్న వారికి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం వివరాలను ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ భాష తెలియజేస్తూ.. ఆశయంలో దాదాపు 30 మంది దాకా వృద్ధులు ఉంటున్నారని, వారికి తినడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఒంగోలునగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఆశ్రమాన్ని, అక్కడి వారి పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈ సహాయాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వారికి
బియ్యం , కందిపప్పు ,నూనె,సబ్బులు,గోధుమపిండి,గోధుమ రవ్వ ,ఉప్మా రవ్వ,మినప్పప్పు వంటి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, జనసేవ శ్రీనివాసరావు, ఆశయం వృధాలయం నిర్వాహకులు గోను లీలా రాణి తదితరులు పాల్గొన్నారు. నిత్యవసర సరుకులు అందజేసి వారి ఆకలి తీర్చడంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని వారు కొనియాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, చైర్ పర్సన్ షహనాజ్ ల మార్గదర్శనంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని ట్రస్ట్ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు.