తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 టీచర్ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మండలం పొదిలి టౌన్ ఆధ్వర్యంలో గురువారం మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు నాయకత్వం వహించారు.మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, డీఎస్సీలో అన్యాయానికి గురైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా పారదర్శకమైన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ రిలే నిరాహార దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, అభిమానులు తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.