1.26 కోట్ల తో నిర్మించిన తారురోడ్డు, బ్రిడ్జిని ప్రారంభించిన నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
రాకపోకలకు వీలుగా, కందుకూరు పట్టణం చుట్టూ వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వెల్లడించారు. దివివారిపాలెం వెళ్లే రోడ్డులో ఆదిఆంధ్రకాలనీ వద్ద ఉప్పువాగుపై 1.10 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, 16.5 లక్షలతో నిర్మించిన తారురోడ్డును గురువారం ఆయన ప్రారంభించారు. పట్టణంలో నుంచి చుట్టుగుంట, ఆనందపురం, కొండముడుసుపాలెం గ్రామాలకు వెళ్లే మార్గాలలో వంతెనలు లేకపోవడం వల్ల, వర్షాల సమయంలో వాగుల వద్ద ప్రయాణాలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆయాచోట్ల వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అమృత్ 2.0 పథకం ద్వారా, 30 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలన్నిటికీ రామతీర్థం తాగునీటి సరఫరాకు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సుమారు 6 వేల కుళాయి కనెక్షన్లు ఇవ్వబోతున్నామని, 30 ఏళ్ల పాటు తాగునీటి సమస్య ఉండబోదని వివరించారు. గడిచిన రెండు దశాబ్దాలలో కందుకూరు పట్టణ పరిధిలో ఇంత పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండడం పట్ల అన్నివర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే మూడేళ్లలో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో గెలుపు జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.అనూష, డిఈ గణపతి, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, పట్టణ మాజీ అధ్యక్షులు కండ్రా మాల్యాద్రి, పిడికిటి వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు చుండూరి మాల్యాద్రి, కోటేశ్వరరావు, అన్నక్యాంటీన్ చైర్మన్ ఉన్నం కొండలరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, ప్రధాన కార్యదర్శి దూదిపల్లి అఖిల, నియోజకవర్గ ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, నల్లూరి సుబ్బారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.