తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణ భద్రతను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్ల వద్ద, రద్దీ ప్రాంతాల్లో మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు.ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలైన హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మైనర్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై ప్రజలకు వివరించారు. ఇవి కేవలం చట్ట ఉల్లంఘనలే కాకుండా, అమూల్యమైన ప్రాణ నష్టం, కుటుంబాల విరహ వేదన మరియు సమాజానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశముందని హెచ్చరించారు.పోలీసు అధికారులు రోడ్డు పై వాహనదారులను ఆపి రోడ్డు భద్రత నియమాలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, ట్రాఫిక్ సైన్ బోర్డుల అర్థాలు, రోడ్డు సూచికల ప్రాముఖ్యత వంటి అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, చట్టపరమైన శిక్షల గురించి కూడా ప్రజలకు వివరించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతపై ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత అనేది ఒక్క పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడి సామూహిక బాధ్యత అని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు. మీ భద్రత – మీ చేతుల్లోనే ఉంది. నియమాలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుదాం.