తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-

ఉలవపాడు మండలం కృష్ణాపురం రైతుల కష్టాలు తీరబోతున్నాయి. ఎలికేరు చెక్ డ్యాం నుంచి చాగొల్లు చెరువుకు వెళ్లే కాలువపై కృష్ణాపురం పొలాల వద్ద బ్రిడ్జి పదేళ్ల క్రితం కూలిపోగా… దాని స్థానంలో 40 లక్షల నిధులతో కొత్తగా బ్రిడ్జి నిర్మించనున్నారు. ఆ పనులకు స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు. 2015 లో బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నప్పుడే అప్పటి ఎమ్మెల్యేకు తాము తెలియజేశామని, ఊరంతా చందాలు వేసుకొని నిర్మించుకోవాలంటూ ఆయన వ్యంగంగా మాట్లాడారని రైతులు గుర్తు చేసుకున్నారు. బ్రిడ్జి గురించి కనీసం పట్టించుకోకపోతే, తామే తాత్కాలిక రిపేర్లు చేయించుకొని రాకపోకలు కొనసాగిస్తున్నామని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. కృష్ణాపురం రైతుల భూములన్నీ ఇటువైపే ఉన్నాయని, బ్రిడ్జి కూలిపోవడంతో పంట ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సమస్య గురించి ఎన్నికలకు ముందు తన దృష్టికి రైతులు అనేకసార్లు తీసుకొచ్చారని చెప్పారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, 40 లక్షల రూపాయలతో కొత్తగా బ్రిడ్జి నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు, స్మశానాల అభివృద్ధి లాంటి కనీస వసతుల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఏడుపదుల వయస్సులో ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సకాలంలో నాణ్యతగా బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ టిడిపి అధ్యక్షుడు చక్రవర్తుల విజయ్ కుమార్, నీటిపారుదల శాఖ జేఈ సీతారామయ్య, టీడీపీ నాయకులు మందాడి హనుమంతరావు, కొల్లి శేషయ్య, కోడిపల్లి పోతురాజు, మందాడి ప్రసాద్, నక్కా మస్తాన్, చౌడుబోయిన హరిబాబు, గణపతిరాజు చలపతి, జాజుల రవి, మల్లవరపు కోటిరెడ్డి, లక్కంరాజు వెంకట్రామరాజు, పోలుబోయిన శ్రీను, రాచగర్ల శివ, కూనం బ్రహ్మారెడ్డి, బండి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *