ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 27 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
జిల్లా ప్రజల నుంచి అందుతున్న వివిధ రకాల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం (PGRS)” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు మరియు పోలీస్ అధికారులు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వ్రాతపూర్వక వినతులను స్వీకరించిన పోలీసు అధికారులు, వారితో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టబద్ధమైన పరిధిలో విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల వివరాలను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు వెంటనే పంపించి, ప్రతి ఫిర్యాదిపై త్వరితగతిన విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేదా అలసత్వానికి తావు లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలన్నారు.జిల్లా పోలీసు కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీసు స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, సివిల్ తగాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్, గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, పామూరు సీఐ వినోద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.