పేదల ఇళ్లపై ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఆందోళనకరం –
ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామం దళితవాడలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ విధానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.గ్రామానికి చెందిన తగరం ఏడుకొండలు భార్యకుమారి అనే వ్యక్తి భర్త చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకున్నాడు. రుణ వాయిదాలు ఆలస్యమయ్యాయనే కారణంతో కంపెనీ ప్రతినిధులు అతని ఇంటికి తాళం వేసి, గ్రామంలో దండోరా వేయించారు. ఈ ఘటన బాధిత కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేయడమే కాకుండా వారి వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద కేటాయించిన కాలనీ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి, వాటిని తనఖా పెట్టించుకుని రుణాలు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, చట్టాలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరిగిందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.రుణాలు వసూలు చేసుకోవడానికి చట్టబద్ధమైన విధానాలు ఉన్నప్పటికీ, ప్రజలను బహిరంగంగా అవమానించడం,భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కావు. పేదలు, దళితులు వంటి బలహీన వర్గాలపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సమాజంలోఆందోళన కలిగించే విషయం.జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ మరియు సంబంధిత నియంత్రణ అధికారులు ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, చట్టవిరుద్ధ చర్యలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్లను తనఖా పెట్టించి రుణాలు మంజూరు చేసే వ్యవహారంపై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పేదల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వంతో పాటు ఆర్థిక సంస్థల బాధ్యత కూడా. రుణ వసూళ్ల పేరుతో మానవ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు సమాజంలో చోటు ఉండకూడదు.