VB-G RAM-G చట్టం అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం కనుమళ్ళ గ్రామ పంచాయతీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) ఉన్నత స్థాయి బృందం మంగళవారం పర్యటించి “వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం – 2025” (VB-G RAM-G Act, 2025) అమలు తీరును పరిశీలించింది.కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రాజేశ్వరి ఎస్.ఎమ్., డిప్యూటీ డైరెక్టర్ ఇషా, సెక్షన్ ఆఫీసర్ ఆశా వాహనేలతో కూడిన బృందం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో విస్తృతంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA) ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. జోసెఫ్ కుమార్తో పాటు ఇతర జిల్లా అధికారులు బృందానికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద కార్మికుల నమోదు, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ, కొత్తగా జారీ చేసిన రోజ్‌గార్ గ్యారెంటీ కార్డుల పంపిణీ, వాటి వినియోగం వంటి అంశాలను కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న కూలీలతో నేరుగా మాట్లాడి, చట్టం ద్వారా కల్పిస్తున్న 125 రోజుల ఉపాధి హక్కు, వేతనాల చెల్లింపు విధానం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై అవగాహనను తెలుసుకుంది.క్షేత్రస్థాయి సిబ్బందికి డాక్యుమెంటేషన్, డిజిటల్ నమోదు ప్రక్రియలపై అవసరమైన సూచనలు, సాంకేతిక సహాయాన్ని కూడా కేంద్ర బృందం అందించింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో, రాష్ట్రంలో ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. ఇదే స్ఫూర్తితో గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది.