బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారికి ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వినతిపత్రం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్యల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారికి బీసీ వర్గాల విద్యా, ఉపాధి, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్ర వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఓపెన్ మెరిట్ సాధించిన బీసీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలోనే పరిగణించి, వారి రిజర్వేషన్ స్థానాలను ఇతర అర్హులైన బీసీ అభ్యర్థులకు కేటాయించే విధంగా స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనివల్ల మరింత మంది బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి, రాజ్యాంగం ఉద్దేశించిన సామాజిక న్యాయం అమలవుతుందని పేర్కొన్నారు.
అలాగే ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిళ్లను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం చేసి యుపిఎస్సి, ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్, బ్యాంకింగ్, ఎస్ ఎస్ సి, ఆర్ఆర్బి తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, డిజిటల్ క్లాస్‌రూమ్స్, ఈ-లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్స్, మాక్ టెస్టులు, కెరీర్ గైడెన్స్, హాస్టల్ మరియు స్టైపెండ్ వంటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని స్టడీ సర్కిళ్లలో సాధ్యమైనంత వరకు బీసీ అధికారులను నియమించడం ద్వారా విద్యార్థుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత మెరుగుపడుతుందని సూచించారు.
అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధునిక సౌకర్యాలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం, స్టడీ సర్కిల్, గ్రంథాలయం, రీడింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లెర్నింగ్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఉద్యోగ సమాచార కేంద్రం, కాన్ఫరెన్స్ హాల్, హెల్ప్‌డెస్క్ వంటి అన్ని సౌకర్యాలతో కూడిన సమగ్ర బీసీ భవన్ ఏర్పాటు చేయాలని కోరారు.
అంతేకాకుండా ప్రభుత్వ కమిటీలు, బోర్డులు, కార్పొరేషన్లలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, బీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కాలానుగుణంగా సమావేశాలు నిర్వహించి వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా బీసీ వర్గాల సామాజిక గౌరవం మరియు సాధికారతను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ కనిగిరి గిద్దలూరులో బీసీ గురుకులాలు నూతనంగా ఏర్పాటు చేయడం పట్ల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారికి, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వినతిపత్రంలోని అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘ నాయకులు నూకసాని వెంకటేశ్వర్లు, మసూద్ అలీ,షేక్ శీను అంబటి ప్రసాద్ రావు, కీర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.