తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
మహిళలు, బాలికలు, విద్యార్థినులు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా విద్యాభ్యాసం కొనసాగిస్తూ, ప్రజా ప్రదేశాల్లో సురక్షితంగా సంచరించేలా చేయడం లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాల వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ నివారణ ప్రత్యేక కార్యక్రమం చేపట్టబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా స్కై ఐ ప్రకాశం (Sky Eye Prakasam) ప్రాజెక్ట్ కింద అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ పాఠశాలలు, కళాశాలలు, మహిళా హాస్టళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.డ్రోన్ కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, మహిళలను వేధించే వ్యక్తులు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే సంబంధిత పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వెంటనే సమాచారం అందించి, సంఘటనా స్థలానికి చేరుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయం చేయబడుతోంది.మహిళలు, బాలికల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, వెంటపడడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో వేధించడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విజిబుల్ పోలీసింగ్ మరింత బలోపేతం చేయబడుతోంది. డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు బృందాలు నిరంతర గస్తీ నిర్వహిస్తూ విద్యాసంస్థల పరిసరాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయి.ప్రజలు తమ పరిసరాల్లో ఈవ్ టీజింగ్, మహిళల వేధింపులు లేదా ఇతర అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతో మహిళలకు మరింత సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.