సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న టంగుటూరు సమీపంలో నిర్వహించనున్న జాతీయ రహదారి దిగ్బంధన కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీ నేతి మహేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.3.30 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.1000 కోట్లు రైతుల మద్దతు ధర కోసం కేటాయిస్తే, పది నియోజకవర్గాలకు పైగా రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరిపి, రూ.1000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పొగాకు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని, అటువంటి నిరసన కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని స్పష్టం చేశారు.అలాగే, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన నిరసనల ఫలితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, అదే విధంగా ఇక్కడ కూడా రైతుల సమస్యలు పరిష్కారానికి ఉద్యమాలు అవసరమని అన్నారు. రైతు పిల్లలు, ఇతర రాష్ట్రాలు మరియు విదేశాల్లో ఉన్న వారు కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తమ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.సోషల్ మీడియా ద్వారా సమస్యలను ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పుడే పాలకుల్లో బాధ్యత పెరుగుతుందని, అప్పుడు మాత్రమే సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఉద్యమం దానికి ఉదాహరణగా నిలిచిందని తెలిపారు.రైతు కుటుంబాలుగా మనం ఎక్కడ ఉన్నా సరే, మన గ్రామాల్లో ఉన్న రైతుల పరిస్థితిని మెరుగుపరచడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా రైతులు కౌలుకు భూములు తీసుకొని వ్యవసాయం చేస్తున్న పరిస్థితిలో, ఒక్క బార్నీకి రూ.4 నుండి రూ.5 లక్షల వరకు నష్టం వస్తే అది వారి జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు వ్యవసాయం వదిలి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడి, గ్రామాలు వెలివాడలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కందుకూరు ప్రాంత యువతకు, ప్రజాస్వామ్య వాదులకు పిలుపునిస్తూ, రైతుల సమస్యలను అర్థం చేసుకుని ఈ నిరసన కార్యక్రమాలను తమ సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా పంచాలని కోరారు. ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *