ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ, చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 3 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేసి సుమారు 8.890 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో కోడిపందాలు, పేకాట మరియు మట్కా వంటి జూద కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి మొత్తం 239 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 46 కేసులు నమోదు చేయబడగా, వారి వద్ద నుండి రూ. 12,43,870/- నగదు, 5 కోళ్లు, 37 మోటార్ సైకిళ్లు, 48 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం,మార్కాపురం జిల్లాలలో ఉన్న 922 మందిని చెడునడతగల వారికి (రౌడీ షీటర్ల) కౌన్సిలింగ్ నిర్వహించి, సత్ప్రవర్తనతో అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. వ్యవహార శైలి మార్చుకోకపోయినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై 2,669 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్న 853 ప్రదేశాలను శుభ్రపరచడం జరిగింది.
రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 3,581 మంది చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధింపజేశారు.
మోటారు వాహన చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై మొత్తం 11,127 ఈ చలానా ద్వారా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 396 మంది వాహనదారులను పట్టుకుని గౌరవ కోర్టులలో హాజరు పరచగా గౌరవ కోర్ట్ వారు రూ.12,62,000/- జరిమానాలు విధించారు.
జిల్లా వ్యాప్తంగా రాత్రి, పగలు గస్తీ నిర్వహిస్తూ పాతనేరస్తులపై నిఘా ఉంచి అనుమానితులను విచారించి, అవసరమైన మేరకు బైండ్ ఓవర్ చేయడం, కౌన్సెలింగ్ నిర్వహించటం జరిగింది.
డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తమ పరిధిలో గ్రామాలు, వార్డులను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, దొంగతనాలు జరగకుండా తీసుకోవలసిన చర్యలు, సీసీ కెమెరాలు, మహిళా చట్టాలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అనర్థాలు, చట్టపరమైన శిక్షలు గురించి అవగాహన కల్పించారు.
అలాగే సైబర్ నేరాలు, లోన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్, రహదారి భద్రత నియమాలు, హెల్మెట్ వినియోగం, కొత్త క్రిమినల్ చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
చట్టాన్ని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *