హైకోర్టు ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ఆధ్వర్యంలో కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరాయకొండ కోర్టు ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ గురుకుల పాఠశాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సివిల్ జడ్జి డాక్టర్ లీల శ్యాంసుందరి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.కోర్టు కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అరుణ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలోని విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా పండ్ల మొక్కలు నాటడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. నాటిన మొక్కలను నిరంతరం సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది కొల్లూరి వెంకట నరసింహారావు, న్యాయవాదులు పంతగాని వెంకటేశ్వర్లు, గోనుగుంట శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మొక్క నాటడం మాత్రమే కాకుండా, దానిని సంరక్షించి పెంచడం కూడా మన బాధ్యత అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.