తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ భాష్యం పబ్లిక్ స్కూల్లో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సింగరాయకొండలోని భాష్యం పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ అంతా కృష్ణాష్టమి శోభతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. రంజాన్ మరియు హెచ్.ఎమ్. తబుసమ్ మేడం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రంజాన్ మాట్లాడుతూ… “భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన సందేశం ఎల్లప్పుడూ ఆచరణీయమైనది. విద్యార్థులు చిన్నతనం నుంచే ధర్మం, క్రమశిక్షణ, కర్మయోగాన్ని అలవర్చుకోవాలని” సూచించారు. అనంతరం హెచ్.ఎమ్. తబుసమ్ మేడం గారు మాట్లాడుతూ… “మన సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించడంలో ఇలాంటి పండుగల వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులంతా కలసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషదాయకం” అని తెలిపారు.ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణల్లో అలరించారు. చిన్నారి కృష్ణుల లీలలు, నృత్య రూపకాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో నిర్వహించిన ఉట్టి కొట్టే (ఉట్టి ఉత్సవం) కార్యక్రమం విద్యార్థుల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది అందరూ పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.