వినాయక చవితి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో అధిక సంఖ్యలో నిమజ్జనాలు జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాలను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు సందర్శించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రదేశాలను పరిశీలించి, పోలీసు శాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.నిమజ్జనం జరుగుతున్న ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. నిమజ్జనల వద్ద డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచటం, భద్రతా సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందాలు కూడా విధుల్లో భాగంగా పాల్గొన్నాయి.తీర ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా మరియు సురక్షితంగా జరిగేలా చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల భద్రత తదితర అంశాలపై జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాల నిమజ్జనాల్లో ఎలాంటి అపశ్రుతులు లేదా అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రమాదాలు సంభవించకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారు పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు జరగేలా చూడాలని, ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించాలని, భక్తులు ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా, చిన్న పిల్లలు సముద్రంలో దిగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు, నిమజ్జనానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేస్తూ ఉండాలన్నారు.నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లు, హెచ్చరిక బోర్డులు, కట్‌ఆఫ్ బోట్లు, లైట్లు, లైఫ్ జాకెట్లు, నాటు పడవలు వంటి అవసరమైన భద్రతా సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గజఈతగాళ్లకు ప్రత్యేక టీ-షర్టులు అందజేయడం ద్వారా వారు సులభంగా గుర్తించబడేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ గారు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా మెరైన్ పోలీసులు కూడా విధుల్లో పాల్గొని సేవలు అందించనున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని భద్రతా, బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు, మెరైన్ పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో గజఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, లైఫ్ జాకెట్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. నిమజ్జనం జరిగే కొత్తపట్నం, పాకాల తీర ప్రాంతాల్లో అదనపు ఎస్పీలను ప్రత్యేకంగా నియమించినట్లు వివరించారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ, పోలీసుల సూచనలు పాటించి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయాలని కోరారు.వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాలువలు, చెరువులు, నదులు తదితర నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ స్టేషన్ అధికారులు కట్టుదిట్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గణేష్ నిమజ్జన ప్రదేశాల్లో ఈత రాని వారు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లోతైన నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రజలు నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నిమజ్జన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు,ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,ఒంగోలు టు టౌన్ సీఐ వీర నాయక్,ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు,కొత్తపట్నం మెరైన్ సీఐ రమేష్ బాబు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్, సింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్, మెరైన్ ఎస్సై సుబ్బారావు మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *