తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మహిళలు మరియు విద్యార్థుల్లో భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రభుత్వ హైస్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మహిళా సాధికారత, మహిళల భద్రత, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలను మహిళలు మరియు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే భయపడకుండా వెంటనే పెద్దలకు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
అదేవిధంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యంపై దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన పరిణామాలను వివరించి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటి నుండి ఎలా జాగ్రత్తపడాలి అనే విషయాలపై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన భవిష్యత్తు కోసం చట్టాలను గౌరవించాలని పోలీసులు పిలుపునిచ్చారు.ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో నేరాల నివారణకు బలమైన పునాది వేస్తున్నామని అధికారులు తెలిపారు.
