తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
రాత్రి సమయంలో నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు ‘Face Wash & Go’ పేరుతో వినూత్న రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న లారీ, బస్సు మరియు ఇతర వాహనాల డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ, అలసట లేదా నిద్రమత్తు అనిపించినప్పుడు తప్పనిసరిగా వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో ఆపి ముఖం కడుక్కొని, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు.నిద్రమత్తులో వాహనం నడపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్ల ప్రాణాలతో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు రోడ్డు భద్రతా సూచనలు అందిస్తూ, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రమాద రహిత ప్రయాణానికి కృషి చేస్తున్నారని తెలిపారు.