తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో తెలుగు దినోత్సవ వేడుకలను శనివారం రెండు క్యాంపస్లలో వైభవంగా నిర్వహించారు. కందుకూరులోని గాయత్రి భవన్–3 (శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్) మరియు గాయత్రి భవన్–5 (శ్రీ గాయత్రి ఈ-టెక్నో స్కూల్) లో ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతి–సంప్రదాయాల వైభవాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాష ప్రాముఖ్యత, తెలుగు సంస్కృతి, మన సంప్రదాయాల గొప్పతనం వంటి అంశాలపై ప్రసంగాలు చేశారు. అలాగే తెలుగు గీతాలను ఆలపిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థుల సందడి కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చింది.తెలుగు భాష మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతీక అని, విద్యార్థులు తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంపొందించుకోవాలని పాఠశాల యాజమాన్యం ఉపన్యసించారు.