తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కె.రాజుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరి ట్రావెల్స్ బస్సు తగులబడింది. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు రాజుపాలెం సమీపానికి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు, మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. రోడ్డు పక్కకు బస్సు ఆపి ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి అరగంటలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెనుక టైర్ వద్ద మంటలు చెలరేగడంతోనే బస్సు తగలబడినట్లు అధికారులు చెబుతున్నారు. తరువాత కావేరి ట్రావెల్స్ యాజమాన్యం, మరొక బస్సును తీసుకువచ్చి ప్రయాణికులను అందులో తరలించారు.
