తొలి శుభోదయం న్యూస్ అమరావతి:-
ట్రాన్స్జెండర్స్ సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభా వంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమం, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్ జెండర్స్ సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…………..ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయం. ట్రాన్స్ జెండర్స్ కి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా ట్రాన్స్జెండర్స్ కి రూ.4 వేలు పింఛను అందిస్తున్నాం. ట్రాన్స్ జెండర్స్ కి ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపి సదుపాయం కల్పిస్తాం. బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రుల్లో ట్రాన్స్ జెండర్స్ కి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం. సెర్ప్ , మెప్మా సహకారంతో ట్రాన్స్ జెండర్స్ కి స్వయం ఉపాధి కల్పిస్తున్నాం. విశాఖలో ఈ ఆటోలు అందించాం. మరికొంత మందిని జీవీఎంసీలో శానిటేషన్ సిబ్బంది గా నియమించాం. తిరుపతిలో గరీమా గృహం ఏర్పాటు చేసి నిరాశ్రయులైన వారికి ఆసరా కల్పిస్తున్నాం. ట్రాన్స్ జెండర్స్ కి ఇప్పటికే 676 మందికి గృహాలు కేటాయించాం. ట్రాన్స్ జెండర్స్ రక్షణ కోసం సిఐడి కేంద్ర కార్యాలయంలో స్వాభి మాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్ లైన్ (1091) ఏర్పాటు చేసాం. ట్రాన్స్ జెండర్లకి గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నాం. మనమిత్ర వాట్సప్ యాప్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ట్రాన్స్ జెండర్స్ ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
