అద్దంకిలో నిర్వహించిన ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమానికి విశేష స్పందన – 64 ఫిర్యాదుల స్వీకరణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజా ఫిర్యాదుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వారి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు సోమవారం అద్దంకి పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘ప్రత్యేక పోలీస్ మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అద్దంకి పట్టణంతో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను జిల్లా ఎస్పీ గారు స్వీకరించారు. అనంతరం వారితో ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని, ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో పరిశీలించి, సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి, చట్టప్రకారం పారదర్శకంగా సమగ్ర విచారణ నిర్వహించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్ట్ పంపించాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడం కోసం అద్దంకిలో ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందిన ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించే విధంగా ముందుకు అడుగు వేస్తున్నామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఇబ్బందులను తగ్గించి, ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలోనే పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదులు తెలియజేసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల ప్రజలు ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయానికి దూర ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. ప్రజాఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి.అదే విధంగా సోమవారం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు నిర్వహించిన మీకోసం కార్యక్రమంకు 74 ఫిర్యాదులు అందినాయి.ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ బాలమురళి కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, అద్దంకి టౌన్ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున రావు, సంతమాగులూరు సీఐ శేషగిరిరావు, దర్శి సీఐ రామారావు, అద్దంకి సబ్ డివిజన్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.