తొలి శుభోదయం న్యూస్ కొండపి :-
దివ్యాంగులు గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తుందని రాష్ట్ర సాంఘిక, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు. దివ్యాంగులకు సామాజిక అధికారిత శివిర్ కార్యక్రమంలో భాగంగా జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొండపిలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 126 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, మ్యాన్యూవల్ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ఊత కర్రలు వంటి 207 ఉపకరణాలను పంపిణీ చేశారు. వీటిలో 49 బ్యాటరీ ట్రై సైకిళ్లు ఉన్నాయి. ఈ ఉపకరణాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటున్నట్లు చెప్పారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ ఇంద్రధనస్సు ‘ కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరును ఆయన గుర్తు చేశారు. దివ్యాంగుల కోసం బాపట్లలో డిగ్రీ కాలేజీని ఈ నెలలోనే ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో డిఆర్సి సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దివ్యాంగులకు హాస్టలును కూడా ఒంగోలులో నిర్మిస్తామన్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బెరా ఎక్విప్మెంట్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంతో విలువైన కాక్లియర్ మిషన్ ను కూడా ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో రూ.40 లక్షలతో దివ్యాంగుల కోసం ప్రత్యేకముగా లిఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన అన్ని కలెక్టర్ కార్యాలయాలలో కూడా లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 290 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని, ప్రకాశం జిల్లాలో కూడా 40 పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాకు రెండు, మూడు చొప్పున ఆటిజం సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతర గురుకులాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి స్వామి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను రూ.3,000 నుంచి రూ.6,000 లకు పెంచామని, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలింకో సంస్థ ద్వారా ఇస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులకు మంత్రి పిలుపునిచ్చారు. బ్యాటరీల స్థానంలో సోలార్ ద్వారా చార్జింగ్ అయ్యే పరికరాలను తయారు చేసేలా కూడా పరిశీలించాలని అలింకో సంస్థను కోరినట్లు మంత్రి చెప్పారు.