తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
గత రెండు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చర్చ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. సిపిఎం కార్యకర్తల శిక్షణా తరగతులు మంగళవారం పెరిదేపి లోని ఎం.ఎస్. విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, రాష్ట్రంలోనే వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రకాశం రెండో స్థానంలో ఉందని ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్లో 56 వేల హెకర్లలో పంటలు వేయాల్సి ఉండగా, గడచిన రెండున్నర నెలల కాలంలో 10వేల హెక్టార్లలో మాత్రమే పంట వేశారని అన్నారు. ప్రత్యేకంగా కొండేపి నియోజకవర్గంలో సుమారు పాతికవేల హెక్టార్లకు పైగా కంది పంట వేసే అవకాశం ఉందని, దానితోపాటు సజ్ఞ, నువ్వులు, మొక్కజొన్న, ప్రత్తి, వరి లాంటి పంటలు వేయాలంటే ప్రజలు ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈపాటికే పొగాకు పంటకు గిట్టుబాటు లేక రైతు బ్రతుకు బజారున పడిందని అన్నారు. కనీసం ఒక వెయ్యి కోట్లు కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను ఆదుకోవాలని రెండు నెలలుగా ప్రాధేయ పడుతుంటే ప్రభుత్వం కానీ, జిల్లా ప్రజా ప్రతినిధులు గాని నోరు మెదపకపోవడం విచారకరమని అన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు కాక, గడిచిన మూడు నాలుగు ఏళ్ల నుండి పొగాకు మీదనే ఆధారపడి జీవిస్తున్న రైతులు ఈ సంవత్సరం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, కేంద్రంతో సంప్రదించి కనీసం 1000 కోట్లు కేటాయించేలా కృషి చేయాలని అన్నారు. రాబోయే రభీ సీజన్ కూడా ఇలాగే కొనసాగుతుందని వాతావరణ పరిశోధకులు చెబుతున్న మాటలు ఆందోళన కలిగిస్తుందని అన్నారు. సుదీర్ఘ కాలం నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు, మూడు నాలుగు దపాలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్న ప్రజా ప్రతినిధులు జిల్లా సమస్యలు పట్టించుకోకనే ఇటువంటి దుర్భిక్ష పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న నీటి వనరులను ఒడిసిపెట్టి ప్రాజెక్టుల నిర్మాణం, ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమలు, పంటల ఆధారంగా పారిశ్రామిక, వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రజా ప్రతినిధులు పట్టించుకోనందునే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వర్షం కురిసినప్పుడు గుళ్ళకమ్మ, పాలేరు, మన్నేరు, సగిలేరు లాంటి అనేక యేరుల ద్వారా సుమారు 150 టీఎంసీల పైగా నీరు సముద్రం పాలవుతుందని అన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చెడ్డను నీటి నిల్వ చేసే ప్రయత్నాలు పాలకులు చేసుంటే ఈరోజు జిల్లాలో ఇంత దుర్భక్ష పరిస్థితులు వచ్చేది కాదని అన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ వేదికగా ప్రకాశం జిల్లా సమస్యలను ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ వేదికగా చర్చ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల విధానాలు అసమానతలు పెంచుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీ కొండారెడ్డి అన్నారు. ప్రజలు రాగాలతో స్థాపించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో ఉన్న ప్రకృతి వనరులు అంబానీ ఆదానీలు కొల్లగొట్టేలాగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. ఫలితంగా దేశ సంపద అంతా కార్పోరేట్ల పరమవుతున్నదని సంపద సృష్టించే శ్రామిక వర్గం అప్పులు అవమానాలు ఆత్మహత్యలతో బ్రతకాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పరిస్థితులు మారాలని కమ్యూనిస్టులు, వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ శిక్షణా తరగతులకు సిపిఎం మండల నాయకులు ముప్పరాజు చిన్న బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. జిల్లా నాయకులు కేజీ మస్తాన్ భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు కంకణాల రమాదేవి, మండల కార్యదర్శి మల్లెల కొండయ్య, సిపిఎం నాయకులు టి రాము, వి.మోజస్, యం.చిన్న పేతురు, ఎ.విశ్రాంత, ఎల్ పరిశుద్ధ రావు, ఎ.సూరిబాబు, వి.సింగయ్య, గుమ్మళ్ళ వెంకటేశ్వర్లు, పుట్టా రామారావు, అంగలకుర్తి బ్రహ్మయ్య, యం. సంపూర్ణ, నిర్మల, దావీదు పాల్గొన్నారు.