తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. పైప్‌లైన్ లీకేజీలు, బోర్లు, మోటార్ల సమస్యలు లేదా త్రాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే 1077 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో జిల్లాలో నీటి లభ్యత, పంపిణీపై నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలు వేయవద్దని రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించామని, వాటికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు, సాగు విధానాలపై సూచనలు చేస్తున్నామని చెప్పారు.జిల్లాలో సుమారు 37 లక్షల పశువులు ఉన్నాయని, వాటి త్రాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో 51 రైతు సేవా కేంద్రాల పరిధిలో తీవ్రంగా, 261 కేంద్రాల పరిధిలో మధ్యస్థంగా, 64 కేంద్రాల పరిధిలో స్వల్పంగా నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. పశువుల నీటి అవసరాల కోసం జిల్లాలో 12,131 బోర్లను మ్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు.రామతీర్థం, గుండ్లకమ్మ రిజర్వాయర్లలోని నీటితో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపామని, ప్రస్తుతం ఆయా చెరువుల్లో సుమారు 55 శాతం నీరు అందుబాటులో ఉందన్నారు. వచ్చే నెలాఖరుకు నాగార్జునసాగర్ నీరు వస్తుందని, ఆ నీటితో చెరువులను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.అందుబాటులో ఉన్న నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే వినియోగించాలని, సాగు అవసరాలు లేదా చేపల చెరువులకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పశుగ్రాసానికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, భవిష్యత్తులోనూ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.సమస్య ఉంటే 1077కు ఫోన్ చేయండి త్రాగునీరు లేదా పశువులకు నీటి సరఫరాలో ఇబ్బందులు, పైప్‌లైన్ లీకేజీలు, బోర్లు, మోటార్ల సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో 1077 టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని, అవసరమైతే 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, పరిస్థితిని బట్టి అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో జాలమ్మ పాల్గొన్నారు.