స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ నిఘాను ముమ్మరం చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను, రాజకీయ పరిణామాలను పరిశీలించడంతో పాటు గ్రామస్థులతో మాట్లాడి ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.ఎన్నికల సమయంలో ఘర్షణలకు దారితీసే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు. ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాలకు దారితీసే చర్యలు, సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే ప్రచారాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గొడవలకు దారితీసే పరిస్థితులు లేదా ఇతర అవాంఛనీయ పరిణామాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు.ప్రజల భద్రత, ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల సమన్వయంతో నిరంతర నిఘా మరియు భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *