అగ్రికల్చర్ ఫార్మర్ రిజిస్ట్రీ యాప్‌లో రైతులందరూ తమ వివరాలను ఈ నెలాఖరులోపు నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు ఆదేశించారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై గురువారం ప్రకాశం భవనం నుంచి మండల, డివిజన్ స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు అవసరమైన విశిష్ట సంఖ్య కోసం రైతులందరూ తమ వివరాలను కచ్చితంగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. రైతులకు సంబంధించిన ‘మీకోసం’ అర్జీలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వినూత్నంగా చేస్తున్న సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రైతుల వివరాలు, అనుసరిస్తున్న విధానాలను సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.వేసవిలో పశువులకు దాణా సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఉత్పత్తి చేస్తున్న సముద్రపు నాచుకు మార్కెట్ అవకాశాలను కల్పించడంపైనా దృష్టి సారించాలని ఆయన చెప్పారు.ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేలా రైతు సాధికార సంస్థ ప్రచురించిన ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిని, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *