మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. 53 ప్రత్యేక బృందాల ఏర్పాటు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
రాబోవు బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో ఎటువంటి మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల స్థాయిలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్ గారిని ను నోడల్ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ మరియు ఇతర సంబంధిత శాఖలతో కలిసి ప్రత్యేక ఎన్ఫోర్స్‌మెంట్ బృందాలు ఏర్పాటుచేసి జిల్లావ్యాప్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, టోల్ గేట్స్, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా మూగజీవాలను తరలించడం, అనుమతులు లేకుండా రవాణా చేయడం, జంతు హింసకు పాల్పడడం లేదా నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు మరియు జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యం దెబ్బతినే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, అనుమానాస్పద రవాణా లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. పోలీసు వారికి సమాచారం ఇవ్వకుండా చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని భౌతికదాడులకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ప్రతి మండలానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 53 ప్రత్యేక బృందాలను నియమించడం జరిగింది. అదనంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందినప్పుడు పశు సంరక్షణ కార్యకర్తలు పోలీసులతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే వెళ్లి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే, అలాంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జాయింట్ యాక్షన్ టీమ్‌లతో పాటు నిరంతరం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో మూగజీవాల వధ జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మత సామరస్యానికి భంగం కలగకుండా పండుగలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కమ్యూనల్ సెన్సిటివ్ ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి, ప్రజల సహకారం తీసుకోవాలని, ముఖ్యమైన మసీదులు, సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలని, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచి, ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. సంతలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహన తనిఖీలు నిర్వహించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని చట్టపరమైన మార్గదర్శకాలను అమలు చేయాలని, పండుగ ప్రశాంతంగా జరిగేలా బందోబస్తును ఏర్పాటు చేస్తుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు.గోవధ, పశువుల అక్రమ రవాణా పై ఏదైనా సమాచారమును పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ -9121102266, 9121102242, డయల్ -112/100, నోడల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్:9121102116 తెలియచేయాలి. సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.