తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే (ఓపెన్ బూజింగ్) ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.పార్కులు, ఖాళీ స్థలాలు, చెరువుల గట్లు, రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓపెన్ బూజింగ్‌కు కేంద్రాలుగా మారిన ప్రాంతాలను గుర్తించి పూర్తిస్థాయిలో క్లీన్ చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముండటంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో ఓపెన్ బూజింగ్, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో సురక్షితమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.
