తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
బ్యాంకుల్లో నగదు లావాదేవీలు నిర్వహించే ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల అటెన్షన్ డైవర్షన్ చోరీలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వివిధ బ్యాంకులను సందర్శించిన పోలీసులు బ్యాంకు సిబ్బందితో సమావేశమై పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసి తీసుకెళ్లే ఖాతాదారులను గుర్తించి అవసరమైన భద్రతా సూచనలు ఇవ్వాలని తెలిపారు. బ్యాంకు పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు.ఖాతాదారులతో నేరుగా మాట్లాడిన పోలీసులు అపరిచితుల మాటలు నమ్మి నగదు లేదా విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచవద్దని హెచ్చరించారు. సహాయం పేరుతో దగ్గరకు వచ్చి దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడే అటెన్షన్ డైవర్షన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లే సమయంలో అవసరమైతే భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌లు, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.