తొలి శుభోదయం న్యూస్ కొండేపి :-
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని రామయపాలెం గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని రైతులతో కలిసి పొలంలో నాగలి దున్ని ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, కనిగిరి సబ్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు సకాలంలో సాగు పనులు ప్రారంభించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు సంప్రదాయ పద్ధతిలో ఎద్దులకు పూజలు నిర్వహించి, వ్యవసాయ పనులను ప్రారంభించడం ఆనవాయితీ అని పెద్దలు పేర్కొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా రైతులు, ప్రజలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.