తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు “జ్ఞాన జ్యోతి ఇయర్–3” శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, చిన్నారులకు బాల్యదశ నుంచే నాణ్యమైన విద్యాబోధన అందించడంతో పాటు సత్ప్రవర్తన, మంచి విలువలు అలవర్చడం ఎంతో అవసరమని తెలిపారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను బలోపేతం చేయడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని అన్నారు. అంగన్వాడీ స్థాయి నుంచే పిల్లల్లో ప్రాథమిక అభ్యసన నైపుణ్యాలు, భాషా మరియు సంఖ్యా నైపుణ్యాలు పెంపొందించాలని సూచించారు. అంగన్వాడీ నుంచి ప్రాథమిక పాఠశాలకు, అక్కడి నుంచి ఉన్నత పాఠశాలకు చేరుకునే క్రమంలో పిల్లలకు బలమైన పునాది ఏర్పడితే వారు ఉన్నత విద్యాబుద్ధులు అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తెలిపారు.
శిక్షణలో నిపుణుల భాగస్వామ్యం
ఈ శిక్షణ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్‌గా ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, కీర్తి శ్రీనివాసరావు,సూపర్వైజర్లు సైదాబీ, కుసుమ వ్యవహరించారు. అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల ప్రారంభ దశ అభ్యసనం, ప్రాథమిక నైపుణ్యాల అభివృద్ధి, పిల్లల సమగ్ర వికాసం తదితర అంశాలపై శిక్షణ అందించారు.
టంగుటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ వై. అంజమ్మ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి, శిక్షణ నిర్వహణ మరియు కార్యకర్తల భాగస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు శిక్షణలో పొందిన అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలానికి చెందిన 68 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని శిక్షణ పొందారు. బాల్యదశ నుంచే పిల్లల్లో విద్య, సంస్కారం, సృజనాత్మకత మరియు ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేందుకు జ్ఞాన జ్యోతి ఇయర్–3 శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.