దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి తనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని పెంపొందించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘అనునేను’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఎంఈవో అబ్దుల్‌ సత్తార్‌ సూచించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పార్ట్నర్స్‌ ఇన్‌ నేషన్‌ బిల్డింగ్‌’ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం స్థానిక బోర్డు పాఠశాలను ఎంఈఓ సందర్శించి ‘అనునేను’ కార్యక్రమంలో విద్యార్థులు వ్యక్తం చేసిన సృజనాత్మక ఆలోచనలు, ఆకాంక్షలు, అభిరుచులను పరిశీలించారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? దేశాభివృద్ధికి తమ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు? అనే అంశాలపై విద్యార్థులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు తమ స్వంత మాటల్లో లక్ష్యాలను వ్యక్తపరచేలా తర్ఫీదు ఇచ్చిన ప్రధానోపాధ్యాయురాలు ఖుర్షీద్ తహ్మీన్ ప్రణాళికా చర్యలను ప్రశంసించారు.పాఠశాల విద్యార్థులు త్రిభాషా సూత్రాలను అనుసరిస్తూ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ భాషలతో పాటు పలు భాషలపై పట్టు కలిగివుండటం ఉపాద్యాయుల ప్రతిభకు దర్పణంగా భావించాలని అన్నారు.ఓ విద్యార్థిని అరబిక్ భాషలో చెప్పిన పద్యాలను అభినందించారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంద్రాగస్ట్ నిర్వహణ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో వంద శాతం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, హర్ ఘర్ తిరంగా అంశాన్ని ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా చేపట్టాలని ఎంఈవో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యత, సమాజ సేవా భావన, భవిష్యత్తు లక్ష్యాలపై అవగాహన కల్పించేలా నిర్వహించాలని సూచించారు.
అనంతరం భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎంఈవో విద్యార్థుల హాజరు, చిన్నారుల మానసిక, శారీరక స్థితిగతులను పరిశీలించారు. ఫిజియోథెరపీ వైద్యురాలు సంధ్య, ఐఈఆర్టీ ఈశ్వరమ్మతో మాట్లాడుతూ విద్యార్థుల వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సిఆర్పీ మురళీ, పాఠశాల ప్రధానోపాధ్యాయిని కుర్షీద్‌ తహ్మీన్‌ , ఉపాధ్యాయుడు ఐ.పి.రామిరెడ్డి , విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *