ఈ నెలాఖరులో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నాడు మార్కాపురం జిల్లా పీసీపల్లి మండలం అలవాలపాడులోని పాలేటి గంగమ్మ తల్లికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. అనంతరం నిర్వహించిన బైక్, ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. తరువాత పీసీ పల్లిలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ, రైతులు నిర్వహించిన కోలాట ప్రదర్సనలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారన్నారు. 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రజల మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి తెలిపారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఊరు, వాడ, గ్రామ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *