తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కళాశాలలు, పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ బూత్లు, పోలింగ్ స్టేషన్లను పోలీసు అధికారులు సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, వాహనాల రాకపోకలు, ఓటర్ల భద్రత తదితర అంశాలను పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని భద్రతా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు ఎన్నికల సిబ్బంది పోలీసులకు సహకరించాలని పోలీసులు సూచించారు.